వెర్రి తలలు వేస్తున్న వినాయక చవితి ఉత్సవాలు



వినాయక చవితి  పిల్లలు, పెద్దలు అందరు ఎంతో ఉత్సాహంగా పాల్గొనే పండుగ . వినాయక చవితి చేయటంలో వినాయకుని మట్టి ప్రతిమ తయారు చేయడం వెనుక, ఇరవై ఒక్క రకాల పత్రి సంపాదించి దానితో స్వామిని పూజించడం వెనుక అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి . ఇవన్నీ వినాయక చవితి సందర్భంగా పలువురు బ్లాగ్ మిత్రులు తెలపడం మనం చదవడం జరిగింది . మా చిన్నప్పుడు మేము కూడా వినాయక చవితి అనగానే చాలా ఉత్సాహంతో ఉండేవాళ్ళం . వారం రోజుల ముందు నుంచి చవితికి పందిళ్ళు వేయడం మొదలు పెట్టేవారు . అప్పటి నుంచి పిల్లలకు హడావిడే . ఊరిలో ఎక్కడో ఒక కూడలిలో మాత్రమే వినాయకుడిని నిలిపేవారు . అది కూడా చిన్న మట్టి విగ్రహం . చవితి ముందు రోజు స్కూల్ ఉండేది కాదు . పిల్లలందరం పత్రీ కోసం ఉదయం వెళితే సాయంత్రానికి ఇంటికి చేరేవాళ్ళం . ఎక్కడెక్కడ తోటలు ,దొడ్లలో పత్రి ఉంటుంది అంటే అక్కడికి పోవడం చెట్లు ఎక్కి పత్రి కోయడం, చెరువులు , కాలువలు తిరిగి కలువ పూలు తేవడం . రాత్రి కూచుని పాలవెల్లిని రంగు కాగితాలు , పూలు , పళ్ళు కట్టి అలంకరించడం సరిపొయెది. చవితి నాడు ఉదయం తలస్నానం చేసి పూజ చేసుకొని , కధ విని అక్షతలు వేసుకొని ప్రసాదం తినటం అప్పుడు చవితి పందిళ్ళ దగ్గరకు వెళ్ళటం జరిగేది . అక్కడ అప్పటికే అందరు వచ్చి పూజలు చేయించు కొనేవారు . మైక్ ఉన్నా అది పూజ చేస్తూ మంత్రాలు చదవటానికే వినియోగించేవారు . సాయంత్రం లోపు తెలిసినవాళ్లు , స్నేహితుల ఇళ్ళకు వెళ్లి ఎవరు ఎక్కువ వినాయకులను చూసామో అని పోటీగా వెళ్ళేవాళ్ళం . అందరు వచ్చి చూస్తారు అని ప్రసాదాలు రెడీగా ఉంచేవాళ్ళం .  ఆరోజు తప్పని సరిగా రాత్రి పందిళ్ళ దగ్గర హరికధ ఏర్పాటు చేసేవారు . నవరాత్రులు అన్నీ హరికధలు, బుర్రకధలు , పౌరాణిక నాటకాలు , ఒకటో రెండో సాంఘిక నాటకాలు ఏర్పాటు చేసేవారు . రోజంతా మైకు హడావిడి ఉండేది కాదు . ఉదయం పూజ సాయంత్రం పూజ తరువాత ఘంటసాల భగవద్గీత , ఉషశ్రీ మొదలైన వారి రికార్డులు , కొద్దిగా సినిమా పాటలు వేసినా మంచి మంచి పాటలు వేసేవారు . పిల్లలు సాయంత్రాలు త్వరగా బోజనాలు చేసి చవితి పందిళ్ళ దగ్గర చేరి ఆడేవాళ్ళం . అది ఆహ్లాదకరంగా సాగే, పూజా కార్యక్రమంగా భక్తి కనిపిస్తూ , కలిగించేదిగా ఉండేది . (తరువాయి భాగంలో మిగిలిన సంగతులు ) 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం